ప్రముఖ కవి, గాయకుడు వంగపండు ప్రసాద రావు (77) మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతుతో, తన పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం తన గొంతును, తన సాహిత్యాన్ని అంకితం చేసిన చరితార్ధుడు వంగపండుగా కొనియాడారు. ఆయన మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. వంగపండు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.
వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తన జీవిత కాలంలో వందల పాటలను రచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాటలకు ఆయన గజ్జెకట్టారు. విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంగపండు పేరుపొందారు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బడుగుబలహీన వర్గాలను, గిరిజనులను చైతన్య పరిచారు. 2017లో కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు.