telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు – అసెంబ్లీ సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రెండో రోజు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆర్థిక పరిస్థితికిపై కేంద్రం, ఆర్బీఐకి తప్పుడు లేఖలు రాశారన్నారు.

రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తోందన్నారు.

మీడియా వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఆర్ధికంగా రాష్ట్రం బాగుంది అని చెబితే… కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయనంటూ జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎన్నికల హామీల్లో 98.44 శాతం అమలు చేశామని సీఎం జగన్ శాసనసభలో తెలిపారు. కోవిడ్ లాంటి సవాళ్లు ఎదురైనా , గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలోని చాలా రాష్ట్రాల కంటే బాగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయన్నారు. కేంద్రం కన్నా ఎక్కువ అప్పులు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని విమర్శించారు. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయని సీఎం జగన్ తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అవి రూ. 2.69 లక్షల కోట్లకు చేరాయన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 123.52 శాతం అప్పులు పెరిగాయని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర రుణాలు రూ.3.82 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు కేవలం 41.4 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గిందని వ్యాఖ్యానించారు.

2018-19లో 5.36 శాతం ఉన్న జీడీపీ.. 6.89 శాతానికి పెరిగిందని జగన్ ప్రకటించారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో వుందని సీఎం వెల్లడించారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో గత మూడేళ్లుగా తొలి మూడు, నాలుగు స్థానాల్లోనే వున్నామని జగన్మోహన్ రెడ్డి వివరించారు.

తాజాగా 2021-22లో రాష్ట్ర జీడీపీ గ్రోత్ రేట్ 11.43 శాతంగా వుందన్నారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో వుందని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 4.45 శాతంగా వుండేదని.. వైసీపీ పాలనలో అది 5 శాతానికి చేరిందని జగన్ వెల్లడించారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా.. వస్తువులకు డిమాండ్ తగ్గకుండా పథకాల ద్వారా పేదల్ని ఆదుకోవడమే రాష్ట్ర పురోగతికి కారణమని సీఎం వివరించారు.

చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు. దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీమ్ ప్రకారమే దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బటన్ నొక్కడంతో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ప్రభుత్వ పాలన విశ్వసనీయత ఉంది కాబట్టే సంక్షేమపథకాలు అమలుచేస్తున్నామ‌ని సీఎం జగన్ అన్నారు.

Related posts