telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆన్​లైన్​లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు..

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదలయ్యాయి . ఉచిత దర్శన టికెట్లు మొట్టమొదటిసారిగా టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను ఈ ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. విడుదలైన అరగంటలోపే సర్వదర్శనం టికెట్లు ఖాళీ అయినట్లు అధికారులు తెలిపారు. 35 రోజుల టికెట్లు కేవలం 30 నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. విడుదల చేసిన 35 నిమిషాల్లో ఏకంగా 2.88 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు. దీంతో అక్టోబర్ 31 వరకు సంబంధించిన కోటా టికెట్ల జారీ ముగిసిన‌ట్లు తెలిపారు.

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఇతర సేవా టిక్కెట్ల మాదిరిగానే సర్వదర్శనం టిక్కెట్లను కూడా తితిదే వెబ్‌సైట్‌ ద్వారా పొందేలా సౌకర్యం కల్పించారు. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.

టికెట్ల బుకింగ్ కు ఉన్న విపరీతమైన డిమాండ్ ను ఎదుర్కోవడానికి వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్ల కేటాయింపు చేశారు. వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్ సైట్ లో లాగిన్ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్ క్యూ పద్ధతి పాటించడంతో సర్వర్ల క్రాష్ సమస్య ఈ సారి తప్పింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు.

ఇదిలాఉంటే ..తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానం ఎంచుకున్నట్లు తితిదే తెలిపింది. ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

జియో సంస్థ సహకారంతో తితిదే వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు విడుదల చేస్తోంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్​ లేదా మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్​తో తిరుమలకు తీసుకురావాల‌ని నిబంధనలు విధించింది.

Related posts