telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కొత్తగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ గంగాధర్‌ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వైయస్ వివేకా కూతురు సునీతతో పాటు సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్‌ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్‌ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కలిసి ఫిర్యాదు చేశాడు.

అంతేకాకుండా నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు. దీనిపై స్పందించిన ఎస్పీ ఫకీరప్ప.. గంగాధర్‌రెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అధికారిగా డీఎస్పీని నియమించినట్లు తెలిపారు. వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. దీనితో పాటు గంగాధర్‌తో పాటు అతడి కుటుంబానికి రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం మడకశిర సీఐగా పని చేస్తున్న శ్రీరాములు గతంలో కడప ఎస్పీగా పనిచేశారు. ఆసమయంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. సీఐ శ్రీరాములుతో పాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా తనపై ఒత్తిడి తెస్తున్నట్లు గంగాధర రెడ్డి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నాడు. గంగాధర రెడ్డి…వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు.

గత 3ఏళ్లుగా అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి వచ్చి నివసిస్తున్నాడు. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సబ్ జైలులో ఉన్నాడు. బాధితుడు గంగాధర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని , గంగాధర్ రెడ్డికి రక్షణ కల్పిస్తామ‌ని ఫక్కీరప్ప తెలిపారు.

Related posts