telugu navyamedia
ఆరోగ్యం

నేడు ‘ప్రపంచ హృదయ దినోత్సవం’

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన మొదలైన అంశాలపై ఈ రోజున ప్రచారం చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి.

కేవలం పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచ హృదయదినోత్సవం ప్రజలకు అవగాహన కలిగిస్తుంది. గుండె స‌మ‌స్యల‌పై ప్రజ‌ల‌కు వివ‌రిస్తారు. గుండె వ్యాధులు రావ‌డం, వాటి కార‌ణాలు, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు సూచిస్తారు. అయితే వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ సభ్యులు నాలుగు ప్రధాన ప్రమాద కారకాల నియంత్రించడం ద్వారా కనీసం 80 శాతం అకాల మరణాలను తగ్గించవచ్చని పేర్కొంది.

*పొగాకు వినియోగం
* అనారోగ్యకరమైన ఆహారం
* శారీరక స్తబ్దత
* మద్యం వినియోగం

గుండె పదిలం:

దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీర, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.


*ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
* చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.
*గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది.

Related posts