రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా ఏపీలో 1.39 లక్షల తెల్లరేషన్ కార్డులు రద్దు చేశారు. లబ్దిదారుల వద్ద కార్డులున్నప్పటికీ అవి పనిచేయడం మానేశాయి. అనర్హులకు జారీ అయినవిగా గుర్తించి వీటిని యాక్టివ్ మోడ్ నుంచి తొలగించారు. కార్డు ఉన్నప్పటికీ సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు. అనర్హుల ఏరివేతలో భాగంగా తొలుత ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ తెల్లకార్డులు పొందిన వారిపై దృష్టి సారించారు. తొలిదశలో ఈ జాబితాలో ఉన్న వారి తెల్లకార్డులను “ఇన్‌యాక్టివ్” గా మార్చేశారు. ఇలా అర్హత లేకుండా తెల్లకార్డులు కలిగిన వారు ఇంకా ఎవరైనా ఉంటే దశల వారీగా రద్దు చేయనున్నారు.
బయోమెట్రిక్ విధానం వచ్చాక నకిలీ కార్డులు పూర్తిగా తొలగిపోయాయి. కానీ అర్హత లేనివారు చాలా మంది తెల్లకార్డులు కలిగిఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. మొత్తం రేషన్‌కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టిపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి పేరులో లేకపోయినా వారి కుటుంబంలో ఎవరి పేరుతోనైనా కార్డుకలిగి ఉంటే వాటిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా లక్షకు పైగా కార్డులు తొలగించారు. ఇకపై అర్హత లేని కుటుంబాలకు కార్డులపై డ్రైవ్ చేపట్టనున్నారు.