telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేను బతికిఉండగా పోలవరం పూర్తవుతుందనే నమ్మకం లేదు..

తాను బతికి ఉండగా పోలవరం ప్రొజెక్ట్ పూర్తవడం అసాధ్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఉండవల్లి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరికి వచ్చిన వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.

కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్, మంత్రి అంబటి చెప్పాలన్నారు.

ఆనాడు డయాఫ్రమ్ వాల్‌ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అంటున్నారని, పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పిన మంత్రి అంబటి రాంబాబుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. ఆయన చెప్పింది నిజం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని తాను మానసికంగా సిద్దపడ్డానని కామెంట్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని.. ప్రాజెక్టు పూర్తికాకముందే వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే.. నిర్వాసితులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిపై ప్రధాని మోదీ ఈడీ పేరుతో భయపెడుతున్నారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

Related posts