telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

తెలుగు సాహిత్యానువాదం .. అన్నిభాషల్లోకి రావాలి.. : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

vice president on telugu literature

నగరంలోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘థౌజంట్‌ హుడ్స్‌’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానువాదం అన్నిభాషల్లోకి విస్తృతం కావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తద్వారా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి రచయితల, దేశభక్తుల ప్రజా నేతల గురించి దేశానికి తెలిసేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ భాషల్లోని సారం మనకు అవసరమని, దాని వల్ల విద్యావికాసం జరుగుతుందన్నారు. భిన్న భాషలకు నిలయమైన భారతదేశంలో అద్భుతమైన సాహిత్య సంపద దాగి ఉందన్నారు. వీటిని డిజిటలైజ్‌చేయడంతో పాటు అనువాదాలను కూడా ప్రోత్సహించాలన్నారు. వీటితోపాటు తెలుగుసాహిత్యాన్ని, చరిత్రను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రతి యూనివర్శిటీలోనూ అనువాదం కోసం అనుబంధ విభాగాలను నెలకొల్పాలని సూచించారు.తద్వారా తెలుగు సాహిత్యాన్ని, చరిత్రను విశ్వవ్యాప్తం చేయాలన్నారు.

తెలుగుదనానికి, భాషకు, భారతీయవిలువలు, సంప్రదాయానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన విశేష సాహిత్య సేవ మరువలేనిదని వెంకయ్యనాయుడు కొనియాడారు. అహింస, సత్యం, విలువలతో దేశానికి మార్గదర్శనం చేసిన జాతిపిత జయంతి నాడు గాంధేయవాదాన్ని బలంగా విశ్వసించిన విశ్వనాథ వారి గురించి మాట్లాడుకోవడం ముదావహమన్నారు. వలస పాలన వల్లదేశంలో మానవ విలువలు, భాష, సంస్కృతి ఎదుర్కొన్న ఇబ్బందులను వేయిపడగలులో వివరించిన తీరు, నేటి సమాజం ఎదుర్కొంటున్న విద్య, కుటుంబం, సమాజం , ఆర్ధిక సాంస్కృతిక ఇలా అన్ని రంగాల్లో దేశం ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాలను ఈ నవలలోపేర్కొన్నారని అన్నారు. కుటుంబ వ్యవస్ధ ద్వారానే విలువలు నిలబడతాయన్నారు. ఆయన సందేశం నేటికీ అనుసరణీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహిత్య విమర్శకురాలు డాక్టర్‌ మృణాలినికి విశ్వనాధ అవార్డు, రచయిత డాక్టర్‌ వైదేహి శశిధర్‌కు వెల్చాల కేశవరావుకు స్మారక అవార్డు అందజేశారు. అలాగే విశ్వనాధ పీఠం ఛైర్మన్‌ ఆక్టర్‌ వెల్చాల కొండల్‌రావు, శాంతాబ యోటెక్నిక్‌ఛైర్మన్‌ డాక్టర్‌ వర ప్రసాద్‌రెడ్డితో పాటుపలువురు సాహితీ వేత్తలు, రచయితలు, సాహిత్యఅభిమానులు పాల్గొన్నారు.

Related posts