వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం “మహర్షి”పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. రైతుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించగా, తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని కొనియాడుతూ వరుస ట్వీట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. “కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం “మహర్షి”. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు వెంకయ్య. గతంలో కార్తీ హీరోగా తెరకెక్కిన చినబాబుపై కూడా వెంకయ్య ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.