telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీదేవి అందుకే ధృవ తారగా మిగిలిపోయింది

Sridevi

సరిగ్గా 36 సంవత్సరాలనాటి మధురమైన జ్ఞాపకం. 1983, నవంబర్ 29న శ్రీదేవితో జరిగిన అరుదైన, అపురూపమైన జ్ఞాపకం. ఆరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని రెండవ ఫ్లోర్ లో సురేష్ ప్రొడక్షన్స్ వారు “ముందడుగు” సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రికలో “హైదరాబాద్ కబుర్లు” పేరుతో షూటింగ్ విశేషాలు రాస్తూండేవాడిని. అలా ఆరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో రామా నాయుడు గారి చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. ఈ సినిమాకు దర్శకుడు కె.బాపయ్య. ఆయన దర్శకుడు కె.విశ్వనాధ్, సాయి ప్రకాష్ గారిలా షూటింగ్ లో వున్నప్పుడు ఖాకీ యూనిఫామ్ లో ఉండేవారు. ఆరోజు షూటింగ్ లో కృష్ణ, శ్రీదేవి, ప్రభాకర్ రెడ్డి, ఇద్దరు చిన్న పిల్లల మీద ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

Mundadugu
“ప్రేమకు నేను పేదను కాను, ఆకలని, దప్పికని అడగకు కన్నా,
వేకువలు, వెన్నెలలు లేవురా కన్నా” అనే పల్లవితో సాగుతుంది.
తన చిన్న తమ్ముడు ఆకలితో ఏడుస్తూ ఉంటే సముదాయిస్తూ శ్రీదేవి పాడే పాట.
నిజంగా ఆ పాట మసును కదిలిస్తుంది. అప్పట్లో సినిమా లోని పాత్రకు తగ్గట్టు డ్రెస్, మేకప్ ఉండేవి. పాత్రోచితంగా శ్రీదేవి కట్టుకున్న చీర చాలా సాదా సీదాగా వుంది . ఎలాంటి అలంకరణ లేకుండా పేదరికం ఉట్టిపడేలా వుంది.
దర్శకుడు బాపయ్య గారితో సినిమా గురించి విశేషాలు తెలుసుకున్న తరువాత “శ్రీదేవితో కాసేపు మాట్లాడతాను” అని బాపయ్య గారిని అడిగాను. నటీనటులతో మినీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా దర్శకుడు లేదా నిర్మాత అనుమతి కావాలి.
అప్పుడు బాపయ్య గారితో మాట్లాడితే “తప్పకుండా, షాట్ గ్యాప్ లో మాట్లాడండి” అన్నారు.
నేను శ్రీదేవి దగ్గరకు వెళ్ళగానే ఆమె పలకరింపుగా నవ్వారు. ఆమె అద్భుతమైన సౌందర్యవతి మాత్రమే కాదు అంతకు మించి తన చిరు నవ్వుతో మంత్ర ముగ్దులను చేసే అపురూప నటీమణి.

Sridevi

ఆమె దగ్గరకు వెళ్లి “మీతో మాట్లాడాలి” అన్నాను నేను నవ్వుతూ.
“అలాగే ” అంది. శ్రీదేవి ఎంత పెద్ద స్టార్ అయినా ఆమెలో అహం, ఆడంబరం ఉండేవి కాదు. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేది. చాలా చక్కటి ప్రవర్తన, క్రమ శిక్షణ కలిగిన నటి.
సెట్లో వున్న నిర్మాత నాయుడు గారితో మాట్లాడుతూ వున్నాను. నాయుడుగారికి నేనంటే చాలా అభిమానము.
అంతలో షాట్ అయిపొయింది. శ్రీదేవి ఫ్లోర్ బయటకు వస్తూ నా వైపు చూసి “రండి” అన్నది.
అప్పుడు నేను ఆమెతో పాటు ఫ్లోర్ బయటకు వచ్చాను.
అప్పటికే ప్రొడక్షన్ బాయ్ రెండు కుర్చీలు వేశాడు.
ఫ్లోర్ బయట ఇద్దరమే వున్నాము. నటీనటులతో మాట్లాడేటప్పుడు మర్చిపోకుండా పాయింట్స్ నోట్ చేసుకోవడానికి చిన్న బుక్ ఉండేది. జేబులో నుంచి బయటకు తీసి… శ్రీదేవితో మాట్లాడుతూ వ్రాసుకుంటున్నా.
అలా మాట్లాడుతూ .. మీరు రాస్తుంది షార్ట్ హ్యాండ్ అనుకుంటా” అన్నది.
“కాదు తెలుగే” అన్నాను.


“నాకు తెలుగులా అనిపించడం లేదే?” అన్నది.
నేను నా బుక్ లో వ్రాసింది చూపించాను. అది చూసి శ్రీదేవి “ఇది తెలుగా ?” అన్నది మళ్ళీ.
“అవును తెలుగే… జర్నలిస్ట్ రాత … అలాగే ఉంటుంది… నాకు మాత్రమే అర్ధమవుతుంది ” అన్నాను .
ఆ మాట విని .. పాత్రలో విషాదంగా వున్న శ్రీదేవి హాయిగా నవ్వింది. ఆనాటి సమావేశం ఓ మధుర స్మృతి.
శ్రీదేవి … భారత సినిమా రంగంలో … సూపర్ స్టార్. వెండి తెర మీద వెలుగులు విరజిమ్మే గ్లామర్ తార … ఎప్పటికీ స్మృతి పథంలో నిలిచే దృవ తార శ్రీదేవి.

– భగీరథ

Related posts