శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు మహాలక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు. పసువు, కుంకుమలతో.. చేతినిండా గాజులు, ఒంటినిండా నగలతో లక్ష్మీ దేవిలా మెరిసిపోతారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలతో భక్తి లోకంలో మునిగిపోతారు. శ్రావణమాసం అనగానే ముందు గుర్తొచ్చేది ‘వరలక్ష్మీ వ్రతం‘. హిందూ స్త్రీలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగ వరలక్ష్మీ వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారికి వరలక్ష్మీ వ్రతం చాలా ప్రత్యేకం. ముత్తయిదువులు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి, వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు. వరలక్ష్మీదేవి సకల శుభాలను చేకూర్చి, ఆయురారోగ్య, అష్టైశ్వర్య, భోగ భాగ్యాలతో తులతూగేలా తమ కుటుంబాలను చల్లగా చూస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి, అభ్యంగన స్నానమాచరించి, ఇంటి ముందు ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి, వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టి, గుమ్మాలకు మంగళ తోరణాలతో అలంకరించి, గడపలను పసుపు కుంకుమతో పూజిస్తారు. ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మండపాన్ని అరటి పిలకలు పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేస్తారు. మండపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. మండపంలో మూడు గుప్పెట్ల బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది అందులో కలశాన్ని ఉంచి మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయ నుంచి దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు రవిక తో అలంకరిస్తారు. దాని గాజులు ఉంచి పూలతో అలంకరిస్తారు. ప్రస్తుతం మార్కెట్లోనూ అమ్మవారి విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా చలిమిడి, వడపప్పు, పానకం, శనగలు, పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని మల్లెలు, సంపెంగలు, మొగలి పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులతో పూజిస్తారు.
అమ్మవారి పూజా విధానం: చక్కగా మండపాన్ని సిద్ధం చేసుకున్న తరువాత, తొమ్మిది రకాల పిండివంటలను సిద్ధం చేసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించటానికి ముందు కలశం ఏర్పాటు చేసుకుని ఆ తల్లిని ఆవాహన చేయాలి. అమ్మవారు ఇంట్లోనే కూర్చున్నారా అన్నట్టు మహిళలు చక్కగా అమ్మవారిని అలంకరించి ఆవాహనం చేస్తారు. వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను చదివి ఆ తల్లి మహత్మ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది. వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి.
అమ్మవారి మహత్యాన్ని చెప్పే వరలక్ష్మీ వ్రత కథ విషయానికి వస్తే పూర్వం మగధ దేశంలో కుండినమనే పట్టణంలో చారుమతి అనే మహాసాథ్వి అయిన ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయవిధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవనం సాగించేది. ఆమె వినయవిధేయతలకు మెచ్చి మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి ఆమెకు వరలక్ష్మీ వ్రతాన్ని ఉపదేశించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్పింది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుతుంది. అప్పటి నుండి ముత్తయిదువులు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారంతా సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి వారికి పండ్లు, తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర నిండు నూరేళ్లు పసుపుకుంకుమలతో చల్లగా జీవించమని ఆశీర్వాదం పొందుతారు. ఈ విధంగా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాదు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని చెప్తారు.
పూజల వెనుక పరమార్ధాలెన్నో ఉన్నాయి. శాస్త్రీయ కారణాలు కూడా చెప్తారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతమే కాదు చేసే పూజలు, ఉండే ఉపవాసాల వల్ల ఆరోగ్యం బాగుంటుందని పసుపు, కుంకుమలు శుభ ప్రదమే కాదు ఆరోగ్యదాయకం కూడా అని పెద్దలు చెబుతారు. పసుపులో క్రిమి సంహారక లక్షణాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని కూడా చెప్తారు. వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయని, అప్పుడప్పుడు ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు.