telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికా అధ్యక్ష పోరు..ఇక కౌంట్‌డౌన్‌ మొదలైంది..

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు.. ఇక కొన్ని గంటల సమయమే ఉంది. దీంతో కీలకమైన బ్యాటిల్‌ గ్రౌండ్‌ స్టేట్స్‌పై దృష్టిపెట్టారు ట్రంప్‌, బైడెన్‌. మరోవైపు ముందస్తు ఓటింగ్‌ జోరుగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు పదికోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.  అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలుకావడంతో.. ఇక క్లైమాక్స్‌ ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న ట్రంప్.. మళ్లీ తానే గెలిచి అధ్యక్షుడిని అవుతానంటున్నారు. అంతేకాదు.. 2016 కంటే ఈ సారి భారీ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో జో బైడెన్‌ అవినీతిపరుడని ఆరోపించారు. ఆయన గెలిస్తే.. దేశంలో పన్నులు విపరీతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు. అటు బైడెన్‌ కూడా ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో దేశాన్ని ట్రంప్‌ ఓడించారని విమర్శించారు. అమెరికాను విభజించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైరయ్యారు..
మరోవైపు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ.. అమెరికాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది ట్రంప్‌కు మైనస్‌గా మారుతోందని ప్రచారం జరుగుతోంది. ట్రంప్‌ కంటే జో బైడెన్‌ ప్రజారోగ్య సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనగలరని.. అమెరికన్‌ ఓటర్లలో సగంకంటే ఎక్కువమంది భావిస్తున్నట్లు ప్యూ రిసెర్చ్‌ పరిశోధనలో తేల్చింది. దేశాన్ని ఏకం చేయడంలో బైడెన్‌ 20 శాతం ఎక్కువ ప్రజాభిమానాన్ని సాధించారని తెలిపింది. డెమొక్రాట్లు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలతో కొవిడ్‌ విషయంలో ట్రంప్‌ గొడవపడుతూనే వచ్చారని.. కలుపుకొని వెళ్లలేదని ఉదాహరించింది. మరోవైపు ఆర్థిక రంగం విషయంలో తప్పితే మిగిలిన ఏ అంశంలోనూ ట్రంప్‌ తన ప్రత్యర్థి కంటే ముందంజలో లేరు.
ట్రంప్‌ ఎక్కువగా అక్రమ వలసల అదుపు, ఆర్థికాంశాలపై జాతీయ వాదం కోణంలో ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లలో 65 శాతం ఉన్న శ్వేత జాతీయుల ఓట్లు కొల్లగొట్టగలనన్నది ఆయన ధీమా. జాతీయ వాద, అమెరికా ఫస్ట్‌ నినాదం 2016లో మాదిరిగా గట్టెక్కిస్తుందా? లేదా అన్నది చూడాలి. సర్వేలు మాత్రం కొవిడ్‌ విషయంలో వైఫల్యాల్నే ప్రజలు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటం.. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా.. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు.. డిజిటల్‌ ప్రచారంపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ క్యాంపెయినింగ్‌తో పాటు ఫోన్‌ కాల్స్‌ చేసి మరీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఓటర్లకు ఫోన్‌ చేసి.. బైడెన్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ముందస్తు ఓటింగ్‌లో అమెరినక్లు భారీగా పాల్గొంటున్నారు. ఇప్పటికే 9 కోట్ల 20 లక్షల మందికిపైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Related posts