ఏళ్ళు కొనసాగిన అయోధ్య వివాదంలో కర్ణాటకకు చెందిన ఇరువురు గురువులు కీలకపాత్ర పోషించారు. వారిలో ఒకరు పెజావర మఠం పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ కాగా, మరొకరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ. వారు చేసిన కృషి గురించి… దేశంలోనే పెను సమస్యగా మూడు దశాబ్దాలపాటు కొనసాగిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు సమగ్రమైన తీర్పు ద్వారా స్వస్తి పలికింది. అయోధ్య సమస్య దేశమంతటికీ చెందినదే అయినా కర్ణాటకకు చెందిన ఇరువురు గురువులు ఇం దులో కీలకపాత్ర పోషించారు. ఆధ్యాత్మిక నగరిగా కృష్ణుడి జన్మస్థలంగా కొలిచే ఉడిపిలోని అష్టమఠాలలో కీలకమైన పెజావర మఠం పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ దశాబ్ధన్నర కాలానికిపైగా అయోధ్య అంశంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పాటుపడ్డారు. అనునిత్యం కృష్ణుడిని కొలిచే పెజావర పీఠాధిపతి దేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు రాకుండా సామరస్యంగా అయోధ్య అంశం కొనసాగాలని ప్రయత్నించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ధర్మ సదస్సులు సాగుతుంటాయి. ఇలా 1985, 2017లలో ఉడిపిలో ధర్మసదస్సులు జరిగాయి.
ఇందులో విశ్వ హిందూపరిషత్ సహా హిందూ మతానికి చెందిన ప్రముఖ గురువులు కూడా భాగస్వాములయ్యారు. 2017లో జరిగిన సదస్సులో అయోధ్య రామమందిరం నిర్మాణం సాధ్యం కావాలని, అది రెండు మతాలకు ఆమోదయోగ్యంగా ఉండాలనే విధంగా చర్చలు సాగాయి. రెండేళ్ల క్రితం ఉడిపిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లింలను అక్కున చేర్చుకున్నారు. ఇలా ప్రతి సందర్భంలోనూ పెజావర మఠాధిపతి రామమందిర అంశం సమన్వయంగా సాగాలని కృషిచేశారు. ఇటీవల గురుపౌర్ణమి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువుగా పెజావర పీఠాధిపతిని సన్మానించిన సందర్భంలోనూ అయోధ్య అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అయోధ్య అంశం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు సాగుతూనే ఉన్నా రాజీ కమిటీని ధర్మాసనం సూచించిన విషయం తెలిసిందే. రాజీ కమిటీలో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ సభ్యుడిగా కొనసాగిన విషయం తెలిసిందే. ముస్లిం మత పెద్దలతో గురూజీ పలు మార్లు చర్చలు సాగించారు. రాజీ కమిటీ కూడా సామరస్యం దిశగానే చర్చలు జరిపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రవిశంకర్ గురూజీ స్వాగతించారు. అసంతృప్తితో ఉన్న ముస్లిం పెద్దలతో చర్చిస్తానని ప్రస్తావించారు. ఇలా అయోధ్య అంశంలో కర్ణాటకకు చెందిన ఇరువురు కీలక పాత్ర పోషించారు.