telugu navyamedia
తెలంగాణ వార్తలు

గణేశ్‌ నిమజ్జనం ట్రాఫిక్‌ ఆంక్షలు

నేడు గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌పై సమాచారానికి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రకటిస్తున్నారు. సందర్శకుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌లో విశ్వేశ్వరయ్య భవన్‌, ఎంఎంటీఎస్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఆనంద్‌నగర్‌ కాలనీ, బుద్ధ భవన్‌, గోసేవా సదన్‌, కట్టమైసమ్మ టెంపుల్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద పార్కింగ్‌ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం తర్వాత నెక్లెస్‌ రోటరీ, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, కేసీపీ మీదుగా, ట్యాంక్‌బండ్‌ మీద నిమజ్జనం తర్వాత విద్యానగర్‌ మీదుగా వాహనాలు వెళ్లనున్నాయి.

అంతర్‌ రాష్ట్ర బస్సులు, లారీలకు నగరంలోకి అనుమతి నిరాకరిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ఇతర ప్రాంతాలకు ఔటర్‌ రింగురోడ్డు నుంచి వెళ్లాలని సూచించారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.

Related posts