telugu navyamedia
ఆరోగ్యం

సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టండిలా!

వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే జలుబు, దగ్గు లాంటి చిన్న సమస్య వచ్చినా.. అది కరోనానా? లేదా సీజనల్ కు సంబంధించినదో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చిరస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు చెబుతున్నారు.

*పాత వాటర్ కూలర్లు, ట్యాంకులు, టైర్లు, పగిలి పోయి పక్కకు పడేసిన కుండలు, గిన్నెలు లాంటివి దోమలకు నిలయాలుగా మారుతాయి. వర్షాలు వచ్చినప్పుడు అందులోకి నీళ్లు చేరి దోమలకు ఆవాసాలుగా మారుతాయి. దీంతో అలాంటి వస్తువులను బయటపడేయాలి. లేకుంటే వాటిలోని నీటిని తొలగిస్తూ ఉండాలి.

*ఇంటి చుట్టుపక్కల నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి. సాయంత్రం సమయంలో దోమల నుంచి రక్షించుకోవడానికి నిండుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇంకా దోమ తెరలు వాడడం కూడా మంచిది. దోమలు ఇంట్లోకి రాకుండా ఎప్పటికప్పుడు డోర్లు, కిటికీలు మూసి ఉంచాలి.

*వ్యక్తిగత పరిశుభ్రను పాటించడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వర్షా కాలంలోనే కాకుండా మిగతా సమయాల్లోనూ బయట నుంచి రాగానే స్నానం చేయడం మంచిది. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

* భోజనం తినడానికి ముందు, వాష్ రూంకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బులతో శుభ్రం చేసుకోవాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు గుడ్డను అడ్డుపెట్టుకోవాలి.

* వర్షాకాలంలో వాతావరణంలోని అధిక తేమ దోమల వ్యాప్తికి కారణమవుతుంది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, న్యుమోనియా.. వంటి వ్యాధులు పిల్లలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది.

*తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి.. వీటి ప్రాథమిక లక్షణాలు. ముఖ్యంగా డెంగ్యూ, న్యుమోనియా విషయాల్లో ఏమరపాటు తగదని, వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

*తులసి, లావెండర్‌.. వంటి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకుంటే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఆహార పదార్థాలు, తాగేనీటిపై దోమలు వాలకుండా మూతలు పెట్టాలి.

*సామాజిక దూరం పాటించాలి. కరోనా నియమాలను పాటించాలి. ఈ పరిస్థితుల్లో జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించాలి. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపించిన వారికి దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ ధరించడం తప్పనిసరి.

* శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా కూడా అనేక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. బయటకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లడం మేలు.

*రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. గోరు వేచ్చని నీరు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం కూడా మంచిదే.

*ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, వృద్ధులు, చిన్నరులను సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లనివ్వకపోవడమే మంచిది.

Related posts