telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

“ఎన్ .ఆర్ ఐ లు ఉద్యమించాల్చిన తరుణం ఆసన్నమైంది” – టి. డి. జనార్దన్

“భారతదేశంలోని ప్రతి రాష్ట్రం పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరాన వున్నదని , రాష్ట్రం లో ఇప్పటికే ముప్పయ్ మూడు పరిశ్రమలు తరలి పోయాయి, అది తలుసుకుంటే కడుపు తరుక్కుపోతోంది” అని తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎన్ .టి .ఆర్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షుడు టి. డి.జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ .టి .ఆర్ శత జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించి, అన్న ఎన్ .టి .ఆర్ ప్రసంగాలను రెండు పుస్తకాలుగా , అన్నగారి వ్యక్తిత్వంపై ‘శకపురుషుడు ‘ అన్న మరో పుస్తకాన్ని వెలువరించిన తరువాత, అమెరికాలో వున్న తెలుగు వారి సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ .టి .ఆర్ 100 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో తానూ అమెరికాలో పర్యటిస్తున్నానని జనార్దన్ తెలిపారు.


కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్న జనార్దన్ మాట్లాడుతూ, అన్న ఎన్ .టి .ఆర్. శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. బహుశ ఇలా ఇప్పటివరకు ఎవరికీ జరగలేదేమో, అన్నగారు కృష్ణ జిల్లాలో జనిమించిన విషయం మీకు తెలుసు , నటుడుగా , నాయకుడిగా ఆయన శకపురుషుడు గా మిగిలిపోయారు . అది మంప్రతీ తెలుగువాడికి గర్వకారణం అని ఆయన చెప్పారు.
‘ఇదే సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దుస్థితిని మీ దృష్టికి తీసుకు వస్తున్నా, జన్మ భూమి పట్ల మీకు కూడా బాధ్యత వున్నదననే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మన పిల్లల భవిష్యత్తు ఏమిటి ? అన్ని రాష్ట్రాలు రెడ్ కార్పెట్ వేసి పరిశ్రమలను ఆకర్శిస్తుంటే, మన రాష్ట్రానికి ఈ తిరోగమనం ఏమిటి ? నాకు చాలా భాధగా వుంది. మీరందరూ ఉద్యమించి పరిస్థితిని చక్కదిద్దడానికి సమాయత్తం కావాలని అభ్యర్ధిస్తున్నా ” అన్నారు జనార్దన్ .
‘భావి తరాల భద్రత కోసం, మన అందరి భవిష్యత్తు కోసం ప్రవాసాంధ్రులు ఏకమై కృషి చెయ్యాలని, మన రాష్ట్రము , మన పిల్లల భవిత కోసం మీ అందరినీ ప్రార్థిస్తున్న’ అని జనార్దన్ విజ్ఞప్తి చేశారు .

Related posts