రాష్ట్రంలో పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీకి రాష్ట్ర ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి కనీసం అభ్యర్ధులు లేరు అన్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీ కి దగ్గరవుతున్నారని, బీఆర్‌ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
జనం గుండె చప్పుడుగా బీజేపీ మారిందన్నారు. తనపై వ్యక్తిగతంగా బురద జల్లేందుకు యత్నిస్తున్నారని, దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు బీఆర్ఎస్ తీరు ఉందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడా లేదని, ఆ పార్టీ చెల్లని రూపాయని రఘునందన్రావు అన్నారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్లపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులే పెరిగాయన్నారు.
30 యూట్యూబ్ చానళ్లకు కేటీఆర్ జీతాలు ఇస్తున్నారని,పేపర్, యూట్యూబ్ చానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్, బీజేపీ విలీనం చర్చలు జరిగాయని కవిత అన్నారని, విలీనం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని రఘునందన్ రావు మరోసారి స్పష్టం చేశారు.
2014లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు తీసుకున్నారని, మేము ప్రజల మనసులు గెలుచుకుని ఎన్నికల్లో గెలిచామని అన్నారు.
ఎన్నికల్లో నేరుగా తమతో పోటీ పడలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరు అడిగారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని, కేసీఆర్ కుటుంబలో పంచాయతీ ఉంటే వాళ్లే తేల్చుకోవాలని అన్నారు. ఇందులోకి బీజేపీని ఎందుకు లాగుతున్నారని ఆయన అన్నారు.
చిట్ చాట్ లు చేయడం ఎందుకని ధైర్యం ఉంటే ప్రెస్మీట్ పెట్టాలని రఘునందన్ రావు బీఆర్ఎస్ కు సవాల్ చేశారు.
తప్పించుకోవడానికే ఈ చిట్ చాట్ ముచ్చట్లని, బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు.
జనం గుండెల్లో బీఆర్ఎస్ కు స్థానంలేదని, తెలంగాణలో భవిష్యత్ అధికారం బీజేపీదేనని రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

