telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ జిల్లాలో ని కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది

ఎన్టీఆర్ జిల్లాలో మరో మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.

చైర్మన్‌‌గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్‌పర్సన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు.

అయితే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దగ్గరుండి మరీ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో తీర్పు ఫలితం అధికారుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్‌ను తెరిచి ఫలితాలను ప్రకటించారు అధికారులు.

కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికాసేపట్లో కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్ పర్సన్‌లుగా కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కొండపల్లి మున్సిపాలిటీకి మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇందులో 14 టీడీపీ, 14 వైసీపీ సరి సమానంగా కైవసం చేసుకున్నాయి. అలాగే ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సీట్లు 15కు చేరాయి.

దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ సొంతమైంది. మరోవైపు 14 మంది వైసీపీ కౌన్సిలర్లకు గాను కేవలం 8 మంది సభ్యులు మాత్రమే హాజరవగా.. మిగిలిన వారు గైర్హాజరయ్యారు.

Related posts