సీఎం జగన్ ప్రభుత్వంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణల తొలగింపుల పేరుతో జగన్ ప్రభుత్వం పేద ప్రజలను రోడ్డున పడేసిందని ఫైర్ అయ్యారు. కృష్ణాపురం, రామకృష్ణాపురం గ్రామాల్లో ఎస్టీలు,పేద దళితులు, మైనార్టీలు జీవనం సాగిస్తున్నారని…. 1972లో దారపాలెంలో అగ్నిప్రమాదం జరిగితే వారిని కృష్ణాపురానికి తరలించి అప్పటి ప్రభుత్వం నీడ కల్పించిందని గుర్తు చేశారు. ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటిస్ధలం, పట్టా, సాగు చేసుకోడానికి ఎకరా స్ధలం ఇచ్చారని.. పాకలు వేసుకుని పశువులను పెంచుకుంటున్న వారిపై అధికారులు ప్రతాపం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల బతుకులను ఉద్దరిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ చేస్తోంది ఏంటి.. విధ్వంసమే తప్పా అభివృద్ధి ఎక్కడా కనిపించడంలేదని మండిపడ్డారు. పేదలు నివాసముండే చోటే వారికి పట్టాలిచ్చి ఆదుకున్న ప్రభుత్వం తమదని… కానీ గతంలో ప్రభుత్వాలు కల్పించిన ఉపాధి అవకాశాల్ని దెబ్బతీయడం ఎక్కడా చూడలేదన్నారు. కృష్ణాపురం, రామకృష్ణాపురం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని…. వారికి న్యాయం జరిగేంతవరకూ విశ్రమించమని పేర్కొన్నారు.