హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు సమావేశ ప్రాంగణంలోకి రావడం తీవ్ర దుమారం రేపింది.
బీజేపీ సమావేశంలోకి వచ్చిన స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారి శ్రీనివాసరావుగా గుర్తించామని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.
ఈ అంశంపై ఇంద్రసేనా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పనేంటి? అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చారు? రహస్యంగా ఫొటోలు ఎందుకు తీస్తున్నారని మండిపడుతున్నారు.
సమావేశంలో జరిగే చర్చ వివరాలను బయటకు చేరవేసేందుకే ఇంటెలిజెన్స్ పోలీసు పాస్‌లతో లోనికి ప్రవేశించారన్నారు. బీజేపీ సమావేశాలను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.
తీర్మానాల కాపీని ఫొటో తీస్తుంటే గుర్తించి పోలీస్ కమిషనర్‌కు అప్పజెప్పామని.. ఫొటోలు డిలీట్ చేయించామని తెలిపారు. ఏ పార్టీ ప్రైవసీ వాళ్లకి ఉంటుందన్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ చేయాలి తప్ప ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.
అంతర్గత సమావేశంలోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదన్నారు. గతంలో టీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు ఎవరు ఇలా చేయలేదన్నారు.ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.