తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేందుకు అధికార యత్రాంగం కసరత్తుచేస్తోంది. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సమావేశమై ఆర్టీసీ వ్యవస్థ లోటుపాట్లను సుధీర్ఘంగా చర్చించారు. నానాటికీ ఆర్టీసీ నిర్వహణ భారంగా తయారైందని చర్చకొచ్చింది.
2020-2021 సంవత్సరంలో రూ2,329 కోట్ల మేర ఆర్టీసీకి నష్టం వాటిల్లిందనే అంశం గణాంకాలతో ప్రస్తావనకొచ్చింది. పెరుగుతున్న డీజిల్ ధరలతో నిర్వహణభారం భరించలేనంతగా తయారైందని గణాంకాల నివేదికను చూసి అధికారయంత్రాంగా ఆశ్చర్యపోయింది.
ఆర్టీసీ ఛార్జీలు పెంచితేగానీ, పరిస్థితిలో మార్పురాదనే అంశాన్ని సమావేశంలో ఆమోదించారు. దీంతో ఆర్టీసీ ఆర్డినరి బస్సులకు కిలోమీటరుకు పావలా, ఎక్స్ ప్రెస్ సర్వీసులపై కిలోమీటరుకు 30 పైసలు పెంచేందుకు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా నడిపిస్తున్న ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రోజుకు సగటున 6లక్షల 80 వేలలీటర్ల డీజిల్ ఖర్చవుతోందని సమావేశంలో చర్చకొచ్చింది.
అడపాదడపా పెరుగుతున్న డీజిల్ ధరలతో మూడేళ్లలో రూ.4 వేల260 కోట్లమేర నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ సమావేశంలో ప్రస్తావించారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి -కేటీఆర్