బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.
“16 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ తలరాత మారింది. ఈ రోజే రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. 2009 నవంబర్ 29 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ సందేశంతో పాటు ఆ రోజు కరీంనగర్‌లో కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పటి వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఆ సమయంలో కార్యకర్తల భావోద్వేగాలు ఉద్విగ్నంగా ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2009 నవంబర్ 29న కరీంనగర్‌లోని అల్గునూర్ వద్ద ‘ఆమరణ నిరాహార దీక్ష’కు పిలుపునిచ్చారు.
దీక్షా స్థలికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.
ఈ అరెస్టు తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ఉద్ధృతమై, చివరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేందుకు దారితీసింది. ఈ రోజును బీఆర్ఎస్ శ్రేణులు ఏటా ‘దీక్షా దివస్’గా జరుపుకుంటాయి.

