telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నల్లకుంట శంకరమఠంలో .. నేటి నుండి శ్రీశారదా శరన్నవరాత్రి మహోత్సవాలు…

sarannavaratri utsav in sankarmat

నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీ శృంగేరీ జగద్గురు మహా సంస్థానం నల్లకుంట శంకరమఠంలో శ్రీశారదా శరన్నవరాత్రి మహోత్సవాలు జరిపేందుకు మఠం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శంకరమఠంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమ వివరాలను బ్రాంచి హెడ్ కె.కృష్ణారావు శుక్రవారం తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ ప్రవచనాలు, సాయంత్రం 7 నుంచి 8.30 వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకూ అమ్మవారికి అలంకరణ, సప్తశతి పారాయణ, రథసేవా అష్టావధాన సేవలు జరుగుతాయన్నారు.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న (శనివారం) ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ శారదాంబకు మహాభిషేకం ఉంటుంది. ఆ రోజు అమ్మవారు జగత్ ప్రసూతిక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 వరకు హరిద్రా దర్శనం ఉంటుంది. 29వ తేదీన బ్రాహ్మీ అలంకరణ, కలశస్థాపన; 30వ తేదీన మహేశ్వరి అలంకరణ; అక్టోబర్ 1వ తేదీన కౌమారి అలంకరణ; 2న వైష్ణవి అలంకరణ, సహస్రమోదక గణపతి హోమం, 3న ఇంద్రాణి అలంకరణ, శతచండీ పారాయణ ప్రారంభం, 4న గజలక్ష్మి అలంకరణ; 5న సరస్వతి అలంకరణ; మూలా నక్షత్రం, 6న దుర్గామాత అలంకరణ; 7న రాజరాజేశ్వరీ అలంకరణ, శతచండీహోమం-పూర్ణాహుతి ఉంటుంది. 8వ తేదీన కామధేను అలంకరణ, విజయదశమి వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు అమ్మవారి దర్శనం ఉండదన్నారు. ఇవే కాకుండా అమ్మవారికి సర్వసేవ, ఉదయస్తమాన పూజ, లక్షకుంకుమార్చన, వెండి రథసేవ, స్వర్ణకమలపూజ, జగద్గురు ఆరాధన పూజాకానుక, శ్రీచక్రార్చన, సువాసినీ పూజ తదితర పూజలు ఉంటాయని వెల్లడించారు.

Related posts