telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండిసంజ‌య్ పాద‌యాత్ర‌కు తెలంగాణ హైకోర్టు అనుమ‌తి..పోలీసుల నోటీసులు సస్పెండ్

*బండిసంజ‌య్ పాద‌యాత్ర‌కు తెలంగాణ హైకోర్టు అనుమ‌తి
*పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని స‌స్పెండ్ చేసిన హైకోర్టు
*ఆగిన చోటే ప్రారంభం కానున్న బండి పాద‌యాత్ర‌

లంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

పాదయాత్ర ఆపాలని వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో ఆగిన చోట నుంచే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈనెల 27న వరంగల్‌ భద్రకాళి టెంపుల్ వద్ద బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.

రెచ్చగొట్టేలా పదే పదే కామెంట్స్ చేయడం, ఉద్రిక్తలు లేవనెత్తడం వంటి ఇతర కారణాలతో జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రను ఆపాలంటూ ఈ నెల 23న వర్దన్నపేట ఏసీపీ బీజేపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ బీజేపీ తెలంగాణ కోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం యాత్రకు అనుమతి మంజూరు చేసింది.

మ‌రోవైపు..జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. బండి సంజయ్ ఈ రాత్రికి పాంనూర్ చేరుకోనున్నారు. రెండు రోజులుగా నిలిచిపోయిన యాత్రను శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.

కాగా..తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు బండి సంజయ్. ఇప్పటికే పలు జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. జనగామ జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. బండి సంజయ్ గ్రామాలు, పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవల బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలు అరెస్టు చేశారు. అవి అక్రమ అరెస్టులను బండి సంజయ్ ఆరోపించారు. పాదయాత్రలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కరీంనగర్ లోని ఇంటికి తరలించారు. అనంతరం పోలీసులు పాదయాత్రను నిలిపివేయాలని నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర కొనసాగించే పక్షంలో చట్ట చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

Related posts