telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కుప్పంలో చంద్ర‌బాబు మూడో రోజు ప‌ర్య‌ట‌న‌..కేంద్రం భారీ భద్రత పెంపు

*కుప్పంలో చంద్ర‌బాబు మూడో రోజు ప‌ర్య‌ట‌న‌..
*చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో భారీ బందోబ‌స్తు
*కాసేప‌ట్లో మోడల్ కాలనీలో చంద్ర‌బాబు రోడ్ షో

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్య ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మోడల్ కాలనీలో చంద్రబాబు రోడ్ షో ఉంటుంది.

ఈ రోడ్ షోకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒక చోట గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు పర్యటించిన గ్రామాల్లో టీడీపీ ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు తొలగించ‌డంతో పరస్పరం రాళ్ల దాడికి దిగడం, చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఈరోజు అప్రమత్తమయ్యారు

మ‌రోవైపు నిన్న చంద్రబాబు పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా.. నేటి నుంచి అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు. 

నిన్ననే ఎన్ఎ‌స్‌జీ డీజీ చంద్రబాబు ఇంటితో పాటు పార్టీ కార్యాలయంలోని ప్రతి గదిని పరిశీలించారు. అనంతరం ఆయన చంద్రబాబుకు భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని కేంద్రానికి లేఖలు రాయడంతో ఈ చర్యలు తీసుకుంది.

Related posts