హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆగస్టు 16న హుజూరాబాద్‌లో జరగబోయే సభ ద్వారా అక్కడ ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకోసం రూ. 500 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈపథకం కింద రూ.500 కోట్లు విడుదల చేస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దళితబంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే అమలు చేయడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లోనూ ఈ పథకాలను అమలు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే తాము తమ పదవులకు రాజీనామాలు చేస్తామని కామెంట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. హుజూరాబాద్‌లో ఈ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలిస్తామని పేర్కొంది.