telugu navyamedia
క్రీడలు

టీమిండియా ఘనవిజయం..

టీమిండియా రెండో టెస్టుమ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో సాధికార విజయాన్ని సొంతం చేసుకుంది. గెలవాల్సిన తొలిమ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ… రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో విజయాన్ని సొంతంచేసుకుంది.

2008లో మొహలి స్టేడియం వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా 320 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.2016లో ఇండోర్ లో న్యూజిలాండ్ పై 337 పరుగుల తేడాతో గెలుపు సాధించింది. 2015లో ఢిల్లీలో జరిగిన టెస్టుమ్యాచులో దక్షిణాఫ్రికాపై 337 పరుగుల తేడాతో విజయబావుటా ఎగుర వేసింది. తాజాగా ముంబై వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ పై 372 పరుగుల తేడాతో ఘనవిజయంతో సిరీస్ చేజిక్కించుకుంది.

Image

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులకే చేతులెత్తేసింది. మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్సులో అద్భుతమైన ఆటతీరుతో 311 బంతులను ఎదుర్కొని 17 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 150 పరుగులు నమోదుచేశారు.

న్యూజిలాండ్ ఆటగాడు అజాజ్ పటేల్ తన బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా తొలిఇన్నింగ్స్ లో పదివికెట్లను ఒక్కడే పడగొట్టి ప్రపంచ రికార్డును నమోదుచేశాడు.

తొలి ఇన్నింగ్స్ లో బ్యాంటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడే ప్రయత్నంచేసినా… టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ టాపార్డర్ ను పెవీలియన్ పంపించడంలో కీలక పాత్రపోషించాడు. ఆతర్వాత బ్యాట్స్ మెన్లు వచ్చినవారు… క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో 62 పరుగులకే చేతులెత్తేశారు.

Image

రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియా నిలకడగా ఆడి పరుగులు రాబట్టుకునే ప్రయత్నంలో సఫలమైంది. మయాంక్ అగర్వాల్ 108 బంతుల్ని ఎదుర్కొని 9 బౌండరీలు, ఒక సిక్సర్ తో 62 పరుగులు నమోదు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 70 ఓవర్లపాటు ఆడిన టీమిండియా 7 వికెట్లుకోల్పోయి 276 పరుగులు చేసిన తర్వాత డిక్లేర్ చేసింది.

భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 167 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 372 పరుగుల తేడాతో విజయంతోపాటు సిరీస్ ను కైవసం చేసుకుంది.

Related posts