టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 73 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.
రాష్ట్రంలోనే కాదు అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పలు సవాళ్ళను ఎదుర్కొన్న ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పుట్టిన రోజు నాడు ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నేటి నుంచి ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండేలా చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు.
చంద్రబాబు నేడు ప్రజల మధ్యే పుట్టినరోజు జరుపుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను కలవనున్నారు చంద్రబాబు. ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు.
సాయంత్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు పాదయాత్ర చేయనున్నారు. అక్కడి గ్రామస్థులతో మాట్లాడి చంద్రబాబు వారి సమస్యలు తెలుసుకుంటారు.
అనంతరం నెక్కలం గొల్లగూడెంలోచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు.
మరోవైపు చంద్రబాబు 73వ అడుగుపెట్టనున్న సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.