వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న ద్వేషాన్ని, వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టాయని నారా భువనేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆమెకు తన పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ “మహిళల పట్ల వైసీపీ నేతల తీరు అత్యంత సిగ్గుచేటు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు ఏమాత్రం స్థానం లేదు” అని అన్నారు.
మహిళలను ఉద్దేశించి అవమానకరమైన పదాలు వాడినంత మాత్రాన వారి విలువ ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు స్త్రీల గౌరవాన్ని ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబెట్టాయని గుర్తుచేశారు.
స్త్రీల గౌరవానికి భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు.
మహిళలకు మద్దతుగా, వారి గౌరవాన్ని కాపాడటానికి అందరం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని భువనేశ్వరి చెప్పారు.


