సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు ఫీజు రియంబర్స్‌మెంట్ విషయమై ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీలో చేరేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మంగళవారం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో మోహన్ బాబు భేటీ కానున్నారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుచుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కీలకనేతగా మోహన్ బాబు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. వైసీపీతో మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకుంటే రాజ్యసభ సీటిచ్చి ఢిల్లీకి పంపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.