గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌తో పాటు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన.. తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ తేదీన ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.
అయితే ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ సరిగా జరగలేదని, డబ్బు కోసమే ఇన్నిరోజులు ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు బాలుని ఇబ్బంది పెట్టారని, బాలు మృతి వెనుక ఏదో పెద్ద కారణం ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడంతో జనాల్లో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా దీనిపై బాలు కుమారుడు ఎస్పీ చరణ్ క్లారిటీ ఇస్తూ ఆసుపత్రి వర్గాలను తప్పుబట్టకండి అని విజ్ఞప్తి చేశారు. ”ఆసుపత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. హాస్పిటల్ బిల్లు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రి మంచి చికిత్స అందించింది. మాకు, వాళ్ళకి ఎలాంటి వివాదాలు లేవు. దయచేసి ఇలాంటి ప్రచారం చేయకండి. నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదు, ఈ టైమ్‌లో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా బాధపెడతాయి. దయచేసి గమనించండి” అని చరణ్ పేర్కొన్నారు.
ఇక బాలుకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ బాలు వైద్యానికి అయిన బిల్లును చెల్లించినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని అన్నారు. బాలు తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు.
చిరంజీవితో సినిమా ఆగిపోవడానికి అసలైన కారణం… సీక్రెట్స్ వెల్లడించిన వర్మ