పీపుల్స్ స్టార్ ఆర్ ఆర్.నారాయణ మూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మృతి చెందారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో తన నివాసంలో కన్నుమూశారు.
దీంతో నారాయణ మూర్తి కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
కాగా రెడ్డి చిట్టెమ్మకు మొత్తం ఏడుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు. వారిలో మూడవ కొడుకు ఆర్. నారాయణ మూర్తి. ఆర్ నారాయణ మూర్తి అసలు పేరు రెడ్డి నారాయణ మూర్తి. అయితే వాళ్ళ ఊరిలో అందరు ఆయనను రెడ్డి బాబు అని పిలుస్తూ ఉంటారట.
ఆర్.నారాయణమూర్తి మహారాణి కాలేజిలో చదువుతున్నపుడు కాలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవాడు. అప్పట్లోనే ఎంతో చురుకుగా ఉంటూ కమ్యూనిజం భావజాలంతో ముందుకెళ్ళేవారు నారాయణ మూర్తి
నారాయణ మూర్తి నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా, గాయకుడిగా, డాన్సర్‌గా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్ ఉంది.
సమాజంలో దిగువ శ్రేణిని ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తారో బహిర్గతం చేసే సమాంతర చిత్రాలను తెరకెక్కించి వాటి ద్వారా ఈయన ప్రసిద్ధి చెందారు. ఆయన చిత్రాల పేర్లు కూడా విప్లవ సంకేతాలు. ‘అర్ధరాత్రి స్వతంత్య్రం’, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, వేగు చుక్కలు లాంటి సినిమాలే తీసారు.