telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘దిశ’కు ఇదే నిజమైన నివాళి : చిరంజీవి

Chiranjeevi

దిశ కేసులో తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్‌పై సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడదుల చేశారు. “దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి. ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్న పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు” అని చిరంజీవి పేర్కొన్నారు.

Related posts