అన్నంకు బదులు తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్2 లోని సాగర్ సొసైటీని ఆనుకుని ఉన్న గుడిసెల్లో భాగయ్య అనే వ్యక్తి తన కొడుకులు శ్రీను, రాజులతో కలిసి నివాసం ఉంటున్నాడు.
కొంతకాలంగా ఇద్దరు కొడుకులు తండ్రిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఆదివారం తినేందుకు బాగయ్య తనకు అన్నం వద్దని, రొట్టెలు కావాలని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఇద్దరు కొడుకులు కర్రతో దాడిచేశారు. తలపగిలిన బాగయ్యను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. సోమవారం కోలుకున్న బాగయ్య తన కొడుకులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.