గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కాసేపట్లో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు బాలు ఆరోగ్యంపై బులెటిన్ ను విడుదల చేయనున్నారు. మరోవైపు బాలు కుమారుడు చరణ్ కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నట్టు సమాచారం. మరోవైపు ఎంజీఎం ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు చేరుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ వచ్చి వెళుతున్నారు. తమిళనాడు ఆరోగ్య మంత్రితో పాటు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. ఇంకోవైపు, ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. 40 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా మారడంతో ఆసుపత్రి వద్ద హై టెన్షన్ గా ఉంది. దాంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలిసులను మోహరించారు. ఇక ఎస్పీ బాలు నివాసం వద్ద వీధులన్నీ శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు కార్పొరేషన్ సిబ్బంది. అలాగే ఎస్పీ బాలు నివాసం వద్ద పోలీసుల హడావిడి కొనసాగుతుంది.
previous post