telugu navyamedia
సినిమా వార్తలు

తమిళ సంగీత దర్శకురాలికి ప్రపంచశాంతి పురస్కారం

Janani

ప్రపంచ శాంతికి దోహదం చేసే కార్యక్రమాల్లో హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందిన తమిళ యువ మహిళా సంగీత దర్శకురాలిని బ్రహ్మకుమరీస్‌ సంస్థ ఘనంగా సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా పాటలతో జరిగిన అమెరికా సంగీత పోటీల్లో జనని స్వరపరచిన తమిళ పాటకు పట్టం కట్టారు. దీంతో బ్రహ్మకుమరీస్‌ సంస్థ చెన్నై కోడంబాక్కంలోని మీనాక్షి మహిళా కళాశాలలో ఆదివారం రాత్రి అభినందన సభ ఏర్పాటు చేసింది.

ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతంలో శిక్షణ పొందుతూ గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఎదిగారు ఎస్‌జే జనని. కర్ణాటక, హిందుస్థానీ, భజన సంగీతంలో ప్రత్యేకత చాటుకున్న ఆమె ఇప్పటివరకు సుమారు వెయ్యికిపైగా కచేరీలు నిర్వహించారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఇళమణి పురస్కారం, జాతీయ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం, సమీకాలంలో ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలు పొందారు. ఇక ‘పూంగాట్రు’ పేరుతో ఆమె రూపొందించిన ఆల్బమ్‌ మరింత పేరు తీసుకొచ్చింది. ఈ ఆల్బమ్‌లోని పాటలన్నీ కవిపేరరసు వైరముత్తు రాశారు. ఇందులో ‘పుదియ ఉలగం మలరట్టుమే..’ (కొత్త ప్రపంచం వికసించనీ..) అనే పాటకు అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో జరగిన ‘గ్లోబల్‌ పీస్‌ సాంగ్‌’ అవార్డు లభించింది. ఒక తమిళ పాటకు ఈ గుర్తింపు దక్కడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అంతేకాదు, కాలిఫోర్నియాలో ఉన్న ‘ప్రాజెక్ట్‌ పీస్‌ ఆన్‌ ఎర్త్‌’ అనే సంస్థ జననిని ప్రపంచ శాంతి సంగీత రాయబారుల్లో ఒకరిగా, సంస్థ సలహాదారుల బృందం సభ్యురాలిగాను నియమించింది. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్‌ కామెరూన్‌ వంటి ప్రపంచ దిగ్గజాలు ఉన్న ఈ బృందంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళగా జనని అరుదైన ఘనత వహించింది. బ్రహ్మకుమారీస్‌ అంతర్జాతీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం విద్యార్థి అయిన జనని ‘పుదియ ఉలగం మలరట్టుమే’ పాటను బ్రహ్మకుమారీస్‌ కోసమే రూపొందించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జననిని బ్రహ్మకుమారీస్‌ సంస్థ సత్కరించింది. కాగా, జనని గతేడాది డిసెంబరులో విడుదలైన ‘ప్రభ’ ద్వారా సంగీత దర్శకురాలిగా తమిళ సినిమాకు పరిచయమైంది.

Related posts