telugu navyamedia
సినిమా వార్తలు

‘వెండితెర’ కృష్ణులు

నేడు (ఆగస్టు 30) శ్రీకృష్ణుడి జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు, కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తున్నాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం, గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తల్లులు తమ పిల్లలను శ్రీకృష్ణుడిగా ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. ఇక టాలీవుడ్‌ తెరపై కూడా మన తారలు శ్రీకృష్ణుడి పాత్రలో అలరించారు.

టాలీవుడ్‌లో కృష్ణుడి పాత్రలు చేసిన వారిలో మొదట చెప్పుకోవాల్సింది నటసార్వభౌముడు ఎన్టీఆర్. శ్రీకృష్ణుడు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చే రూపం అన్నగారిదే. అప్పట్లో శీకృష్ణుడు అంటే ఎన్టీఆరే అనే వారు. ఆ తరువాత ఎంతోమంది ఆ పాత్రను పోషించినా ఇప్పటికీ శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రజలకు అన్నగారే గుర్తుకొస్తారు. ఏఎన్నాఆర్ సినీ జీవితంలో ఏ సినిమాలోనూ శ్రీకృష్ణుడి పాత్ర వేయలేదు. కానీ ‘గోవుల గోపన్న’ సినిమాలో మాత్రం ఒక పాటలో మాత్రం శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఎన్టీఆర్ తర్వాత శ్రీకృష్ణుడిగా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిన ఘనత కాంతారావుకు దక్కుతుంది.

బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కాసేపు శ్రీకృష్ణుడిగా అలరించారు. ఇక అందాల నటుడు శోభన్ బాబు బాపు డైరెక్షన్‌లో వచ్చిన ‘బుద్దిమంతుడు’ సినిమాలో మొదటి సారి శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరెక్కిన ‘కురుక్షేత్రం’ మూవీలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా నటించారు. ‘పాండురంగ మహత్యం’ సినిమాలో విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించారు. నందమూరి హరికృష్ణ కూడా. ‘శ్రీకృష్ణావతారం’ మూవీలో బాలకృష్ణుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అతిలోకసుందరి శ్రీదేవి …‘యశోదకృష్ణ’ సినిమాలో బాలకృష్ణుడిగా నటించింది.

‘శ్రీకృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ లో నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణుడిగా నటించారు. ఈ పాత్రలో బాలయ్య ఒదిగిపోయారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ కృష్ణుడిగా నటించారు. నాగార్జున కూడా విష్ణు హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున’లో శ్రీకృష్ణుడి పాత్రను తనదైన శైలిలో మెప్పించాడు. అయితే గెటప్‌ వేయకుండా కేవలం పాత్ర మాత్రమే చేశారు.

 

ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా ‘గోపాల గోపాల’ సినిమాలో కృష్ణుడిగా కనిపించాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘యువరాజు’ సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. ‘అందాలరాముడు’ సినిమాలో ఓ పాటలో నటుడు సునీల్ శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను అలరించాడు. పాత్రలే కాదు కన్నయ్యకు సంబంధించి టాలీవుడ్‌లో పలు పాటలు ఉన్నాయి. ఇవన్నీ ప్రేక్షకులను అలరించాయి.

Related posts