ఇంగ్లీష్ సాంగ్ తో చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.
తాతలు హరికథా కళాకారులు. నాన్న ఏమో సినిమా దర్శకుడు. అమ్మ కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యురాలు. మామయ్య సినిమా ప్లేబ్యాక్ సింగర్. వీరందరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా, జానపద రంగాల్లో రాణిస్తున్నది స్ఫూర్తి జితేందర్. కళను సజీవంగా ఉంచడానికి ఆమె తనవంతుగా ఎప్పటికప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చిన్న వయసులో హీరో రవితేజ సినిమాలో ఐటమ్ సాంగ్ పాడిన గాయనిగా రికార్డు సృష్టించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన స్ఫూర్తి జితేందర్ ఎలిమెంటరీ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తుండగనే యమహోయమ సినిమాద్వారా సినీ నేపథ్య గాయనిగా మారి తన పేరు మీదే ఒక రికార్డు సృష్టించుకుంది. ఇప్పటివరకు సుమారు 80 చిత్రాల్లో 100కు పైగా పాటలతో అలరించిన స్ఫూర్తి జితేందర్ తన హాలీవుడ్ పాట న్యూయార్క్ టైం స్క్వేర్ లో రిలీజ్ చేసి ఇప్పుడు మరో ఒక కొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. పదుల సంఖ్యలో మిలియన్ల కొద్దీ వ్యూస్ కలిగిన పాటలు తన ఖాతాలో కలిగి ఉండడం స్ఫూర్తి జితేందర్ స్పెషాలిటీ.
ప్రపంచ ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ మ్యూజిక్ వోకల్ 8 గ్రేడ్స్ పూర్తిచేసిన స్పూర్తి తాజాగా ‘ఐ ఫీల్ యు’ అనే ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ చేశారు. తనే స్వయంగా రాసి, పాడి, నటించిన ఈ ఆల్బమ్ న్యూయార్క్, న్యూజెర్సీలలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఈ ప్యూర్ లవ్ సాంగ్ పోస్టర్ ను ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించి స్పూర్తికి ఆల్ ది బెస్ట్ చెప్పగా ఈమధ్యే న్యూయార్క్ టైం స్క్వేర్ సెంటర్లో అంగరంగ వైభవంగా సాంగ్ రిలీజ్ అవ్వడం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సాంగ్ రిలీజ్ చేసిన సమయంలో న్యూయార్క్ లోనే టైం స్క్వేర్ బిల్ బోర్డ్స్ లో ఈ విజువల్స్ ప్లే అయ్యాయి. మదీన్ ఎస్.కె. సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ ను ప్రవాస భారతీయులు రాహుల్ సి.హెచ్., తేజస్వి వైష్ణవ తమ మిత్ర బృందంతో కలిసి నిర్మించారు. అయితే ఒక తెలుగు సినీ నేపథ్య గాయని ఈ స్థాయిలో అంటే న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వరకు వెళ్లి అక్కడ బిల్ బోర్డ్స్ లో ప్రదర్శించి మరీ తన సాంగ్ రిలీజ్ చేయటం అనేది మన సినీ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. సంగీతంలో ఆస్కార్ అవార్డ్ లాంటి గ్రామీ అవార్డ్ సాధించి మన దేశం గర్వపడేలా చేయడం తన లక్ష్యంగా నిర్దేశించుకున్న స్పూర్తి అందులో భాగంగా ఐ ఫీల్ యు అంటూ తన మొదటి మ్యూజిక్ వీడియో ని రిలీజ్ చేసింది. కేవలం ఇంగ్లీషులోని మాత్రమే కాదు స్పానిష్ లో సైతం సాంగ్స్ రాస్తున్న స్ఫూర్తి జితేందర్ గతంలో పాడిన ఒక హిట్ సాంగ్ ఇప్పుడు 160 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. ఇక ఇప్పుడు ఆమె ఒక ఇంగ్లీష్ స్పానిష్ మిక్స్ సాంగ్ కోసం పనిచేస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లో సాంగ్స్ పాడుతున్న ఆమె అమెరికాలో సైతం వరుస ఈవెంట్లలో పాల్గొంటూ అలరిస్తున్నారు.
పిట్టకథలు చెప్తోన్న శ్రీరెడ్డి… ఎందుకంటే…?