telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ఆర్ ను అంటే ఖబర్దార్‌.. ఊరుకునేది : షర్మిల

సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం కరోనా బాధిత కుటుంబాలను వైఎస్‌ షర్మిల పరామర్శించారు. వారి బాధలు విని, భావోద్వేగానికి లోనైన షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిని కించపరిచేలా మాట్లాడుతున్నారని, తెలుగు ప్రజలకు వైఎస్సార్‌ అంటే ఏమిటో తెలుసన్నారు. ఆయన్ను ఏమైనా అంటే ఖబర్దార్‌.. ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు.  సుమారు 40 మందికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు పేదలంటే చిన్నచూపు ఎందుకని.. కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేరిస్తే పేదలకు కార్పొరేట్‌ హాస్పిటళ్లలో వైద్యం ఉచితంగా దక్కేదన్నారు. పేదలకు జబ్బు చేస్తే ఉచితంగా వైద్యం దక్కాలని దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఉచితంగా వైద్యం పొందడం పేదల హక్కు అని, ప్రపంచంలో ఎవరూ చేయని ఆలోచన వైఎస్సార్‌ చేసి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని షర్మిల గుర్తుచేశారు. కరోనాతో వేలాది మంది మరణించారని, కరోనా వైద్యం ఖర్చులు భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? సీఎం కేసీఆర్‌కు కరోనా వస్తే యశోదలో చేరారని, అదే పేదలకు వస్తే గవర్నమెంట్ హాస్పిటళ్లలో చేరాలా? ఇదెక్కడి న్యాయమని అడిగారు. గవర్నమెంట్ హాస్పిటళ్లపై సీఎం కేసీఆర్‌కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని, ఉప ఎన్నికల సమయంలో ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చి రెండు కామెంట్లు చేసి వెళ్లిపోతారని వైఎస్‌ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చి పేదల కన్నీళ్లు చూడాలన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసి రూ.వేల కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్‌.. అని షర్మిల విమర్శించారు. 

Related posts