మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో కలిసి ఆయన ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. తమ మూడు పార్టీలకు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఉందని, కొందరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని చెప్పారు.
తమ పార్టీకి వ్యతిరేకంగా అజిత్ పవార్ వ్యవహరించారని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ నుంచి ఒక్క నేత కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా లేరని వివరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందని, ఎమ్మెల్యేలందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నిజమైన ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ బీజేపీతో చేతులు కలపబోరని పేర్కొన్నారు.