telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రెండో వన్డేకు సిద్దమైన .. విశాఖ స్టేడియం.. వెయ్యిమందితో భారీ భద్రత…

visakha stadium ready for 2nd odi

రేపు జరగనున్న భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డేకి విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. పీఎం పాలెం స్టేడియంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం, సాయంత్రం ఇరు జట్లు స్టేడియం బి గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తారన్నారు.మ్యాచ్‌ ప్రారంభమయ్యే రెండు గంటలు ముందు స్డేడియంలోని 20 ప్రవేశద్వారాలు నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తామన్నారు. గ్యాలరీల్లోనే ఫుడ్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం ఉండడంతో గ్యాలరీల్లోనే 22 పాయింట్లలో ప్రేక్షకులకు పేపర్‌ గ్లాసుల్లో తాగునీరు అందిస్తామని శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ క్రికెటర్‌ వేణుగోపాలరావు పేరుతో బుధవారం 11 గంటలకు ఒక గేటుకు నామకరణం చేసి దాన్ని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మెన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు తదితరులు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రేక్షకులు లోపలికి ఎలాంటి వాటర్‌ బాటిళ్ళు, హెల్మెట్లు, పేలుడు సామగ్రి తీసుకురాకూడదని, భద్రత కారణంగా వాటిని అనుమతించమని చెప్పారు. వాహనాలు పార్కింగ్‌కు స్టేడియం సమీపంలోనే మూడు చోట్ల స్థలాలు కేటాయించామన్నారు. మొత్తం 28 వేల టికెట్లలో ఇప్పటి వరకు 16 వేల టికెట్లు అమ్ముడు పోయాయని చెప్పారు. మరో 2,800 కాంప్లిమెంటరీ పాస్‌లని చెప్పారు.

ఈ నేపథ్యంలో రెండు జట్ల క్రీడాకారులతో పాటు ప్రేక్షకులకు భద్రత కల్పించడానికి 1050 మంది సివిల్‌ పోలీసులు రక్షణగా ఉంటారని నగర డీసీపీ రంగారెడ్డి తెలిపారు. అన్ని గేట్ల వద్ద మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ట్రాఫిక్‌ నియంత్రణకు 350 మంది ట్రాఫిక్‌ పోలీసులను నియమించినట్లు తెలిపారు. ఇటీవల స్టేడియంలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఒక అభిమాని మైదానంలోకి దూసుకువెళ్లిన దృష్ట్యా ఈసారి అటువంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయాలని, అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం శరత్‌చంద్రారెడ్డి, ఏసీఏ సెక్రటరీ వి.దుర్గాప్రసాద్‌, డీసీపీ రంగారెడ్డి, విష్టుకుమార్‌రాజు, వాల్తేర్‌ రైల్వే డీఆర్‌ఎం, క్రికెటర్‌ వేణుగోపాలరావు తదితరులు పిచ్‌ను పరిశీలించారు. ఫ్లడ్‌లైన్లను చెక్‌ చేశారు. పిచ్‌తో పాటు, ఔట్‌ఫీల్డును పరిశీలించి క్యూరేటర్లను అభినందించారు.

Related posts