telugu navyamedia
సినిమా వార్తలు

అదే రామారావు గారిలో ఆకర్షణ శక్తి…

నిర్మాత మురారి “గోరింటాకు” షూటింగు కోసం యూనిట్‌తో వైజాగ్‌ వెళ్లారు.. అదే టైంకి ఎన్టీఆర్‌ పోలీసుల కోసం నిధులు సేకరించడానికి రైల్లో అక్కడికి వచ్చారు.. ఎవరో ఎన్టీఆర్‌కు చెప్పారు దాసరి దర్శకత్వంలో సినిమా షూటింగు జరుగుతోందని.. నిర్మాతెవరో కనుక్కుని ఆర్టిస్టులందరినీ పెరేడ్‌ గ్రౌండ్స్‌లోని కార్యక్రమానికి తీసుకురమ్మనమని ఎన్టీఆర్‌ మనిషిని పంపారు..

మురారి అక్కినేని ఫ్యాన్.. ఒళ్లు మండి ఆయన ప్రోగ్రాం కోసం మనం షూటింగు కాన్సిల్‌ చేసుకుని వెళ్లడమేంటి, దాసరికి చెబితే ఆయన ఒప్పుకోరు అని వచ్చిన మనిషిని దాసరి దగ్గరికి పంపారు “అలాగే, అందరం వస్తాం” అని చెప్పి పంపించేశారు దాసరి..

మురారికి చికాకేసింది.. దాసరితో ”కావాలంటే మీరు వెళ్లండి, నేను రాను” అని చెప్పేశారు.. సావిత్రి అది విని ”అలా అనవచ్చా? మేమందరం వుండగా నీ దగ్గరకే మనిషిని ఎందుకు పంపారు? నిర్మాతగా గౌరవం యిచ్చినట్లే కదా” అన్నారు. ఈ లోపు దాసరి “సాయంత్రం ఫంక్షన్‌కు దండలు ఏర్పాటు చేయండి” అని ప్రొడక్షన్‌ వాళ్లకు చెప్పారు.. మురారికి యింకా కోపం వచ్చింది వచ్చింది – ”దండలు మీరందరూ వేస్తే వేయండి, నేను అక్కడకు వచ్చినా దండా అదీ ఏం వేయను” అన్నారు..

అప్పుడు శోభన్‌బాబు మనం అక్కడికి వెళ్ళగానే ఆయన నిన్నే ముందు పిలుస్తారు, నువ్వు దండ వేస్తావు.. ఆ తర్వాత నీ మాటలు, చేతలు నీ అధీనంలో వుండవు” అన్నారు. దానికి మురారి “సొల్లు కబుర్లు చెప్పకు” అన్నారు.. “దమ్ముంటే పందెం కాయి” అన్నారు శోభన్‌బాబు.. పక్కనే వున్న చలం, దాసరి కూడా పందెం అన్నారు.. ”ఓడిపోతే రేపు మీ అందరికీ లంచ్‌లో స్వీట్లు, కోడి కూర” అన్నారు మురారి పంతంగా..

సాయంత్రం మీటింగులో వేదికపై ఎన్టీఆర్‌ మైక్‌ వద్దకు వచ్చి.. “అందరికీ స్వాగతం, యువచిత్ర యూనిట్టంతా వచ్చినందుకు నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు” అని ”రండి మురారిగారూ” అంటూ వేదికపైకి పిలిచారు.. మురారికి కాళ్లలో వణుకు ప్రారంభమైంది.. కదల్లేదు.. సావిత్రిగారు నవ్వుతూ ”నిన్నే పిలుస్తున్నారు, వెళ్లు” అన్నారు. . శోభన్‌బాబుకి మురారి పరిస్థితి అర్థం అయ్యి మురారి చెయ్యి పట్టుకుని స్టేజి దాకా తీసుకెళ్లారు.. తర్వాత దాసరి, సావిత్రి, శోభన్‌, చలం – అందర్నీ వేదికపై ఆహ్వానించారు. సావిత్రి పైకి రాగానే ఎన్టీఆర్ భార్య బసవతారకం గారికి నమస్కరించారు. అది చూడగానే మురారి లేచి తనూ ఆవిడకు నమస్కరించారు.

కాస్సేపటికి దాసరి మైక్‌ తీసుకుని యూనిట్‌ అందర్నీ పరిచయం చేయడం మొదలుపెట్టారు.. మొదటగా మురారి పేరు చదివారు.. మురారి దండ వేయడం, ఎన్టీఆర్ రండి మురారిగారూ అంటూ దగ్గరకు తీసుకోవడం జరిగాయి. మర్నాడు షూటింగు లంచ్‌లో అందరికీ స్వీట్లు, కోడికూర..

ఇదెలా జరిగిందో తనకే తెలియలేదంటారు మురారి.. ”నా చేతికి ఎవరు దండ యిచ్చారో, నేను ఎలా వేశానో నాకే తెలియదు.. తర్వాత ఏం జరిగిందో నాకు యిప్పటికీ గుర్తు లేదు.. తెలియని అనుభూతి.. నాలో నేను లేను.. నిజంగానే ఆయన రారాజు.” అని రాసుకున్నారు తన ఆత్మకథ ”నవ్విపోదురు గాక”లో

Related posts