telugu navyamedia
సినిమా వార్తలు

శేఖర్ కమ్ములకు కూడా “లవ్ స్టోరీ ” ఉందా ?

అవును దర్శకుడు శేఖర్ కమ్ములకి ఒక లవ్ స్టోరీ ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే ముందు కొంత అతని సినిమాల గురించి చెప్పాలి. దర్శకుడు శేఖర్ కమ్ముల అందరిలాంటి వాడు కాదు. సినిమా అంటే అమితమైన ప్రేమ. ఎప్పుడూ దాన్ని గురించే ఆలోచిస్తుంటారు. తనకున్న పేరుకు పూర్తి వ్యాపార సినిమా లు నాలుగు డబ్బులు సంపాదించుకొని ఆస్తులు కూడపెట్టుకుందామన్న ఆశలు లేనివాడు. సామాజిక స్పృహ మాత్రమే కాదు బాధ్యత కలిగినవాడు ఆయన దర్శకత్వం వహించిన, “డాలర్ డ్రీమ్స్, “ఆనంద్ “, ” హ్యాపీ డేస్ “, “గోదావరి “, “లీడర్ “, ఫిదా ” ఇప్పుడు రూపొందించిన ” లవ్ స్టోరీ “, ఆయన ప్రతి సినిమాలో అంతర్లీనంగా ఎదో ఒక సందేశంలో ఉంటుంది .

అది మిగతా సినిమాల్లో చూపించే షుగర్ కోటెడ్ లా కాకుండా, వాస్తవానికి దగ్గరగా వుండి మనల్ని ఆలోచింపజేస్తుంది.
శేఖర్ కమ్ముల కథ ఎన్నుకునే తీరు, దానిని తెర మీద చూపించే పద్ధతి, పాత్రలను మలచే విధానం, సంగీతానికి ఇచ్చే ప్రాధాన్యత అన్నీ ఆయన అభిరుచిని తెలియజేస్తాయి. మన సినిమాల్లో హీరోల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కథ కూడా హీరో గొప్పతనాన్ని చెప్పడానికే తయారు చేస్తారు. హీరోయిన్ పాత్రలకు అంత ప్రాధాన్యత ఉండదు, హీరోతో పోల్చితే హీరోయిన్ కేవలం గ్లామర్ డాల్ గానే చూస్తారు, వారి ప్రభావం ప్రేక్షకులపై అంతగా ఉండదు.

అయితే శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రల ప్రభావం మన మీద అమితంగా ఉంటుంది . 2010వ సంవత్సరంలో శేఖర్ కమ్ముల దగ్గుబాటి రానా, ప్రియా ఆనంద్, సుహాసిని, రిచా తో నిర్మించిన ” లీడర్ ” సినిమా రాజకీయ రంగంలో పాతుకుపోయిన అవినీతి, పదవి కోసం అవలంభించే వికృత చేష్టలు, వ్యవస్థ లో వున్న లోపభూయిష్టాలపై శేఖర్ సంధించిన ప్రయోజనాత్మక అస్త్రం “లీడర్ “.

ఈచిత్రం లో రానా పాత్ర అర్జున్ ప్రసాదుతో “మనకు స్వాతంత్రం వచ్చిన అరవై సంవత్సరాలు తరువాత కూడా ఇంకా దేశంలో అంటరాని తనం వుంది అంటే సిగ్గుపడాలి ” అని చెప్పిస్తాడు. ఈ డైలాగే శేఖర్ కమ్ములను బాగా కదిలించింది . సమాజంలో అంటరాని తనం , కులాల వైషమ్యాలు , కుమ్ములాటలు , స్త్రీ , పురుషులకు సమాన గౌరవం లేకపోవడం. పురుషుడికిచ్చే ప్రాధాన్యత మహిళలకు లేకపోవడం మొదలైన విషయాలు శేఖర్ కమ్ములను బాగా ప్రభావితం చేశాయి . దీనిపై సినిమా చెయ్యాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అయితే అది 10 సంవత్సరాల తరువాత కార్యరూపం దాల్చింది. మన దేశంలో కులం ప్రభావం చాలా వుంది. మనుషుల ప్రతిభ కాదు కులమే ముఖ్యం. కులమే సమాజంలో అసమానతలకు, ఆజ్యం పోయడానికి కారణమవుతుంది. యువతీ, యువకులు ప్రేమించుకున్నా వివాహానికి కులాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఇక తల్లితండ్రులు అబ్బాయికి ఇచ్చిన ప్రాధాన్యత అమ్మాయికి ఇవ్వడం లేదు . ఒకప్పుడు ఆడపిల్లలకు పెద్ద చదువులు కూడా చెప్పించేవారు కాదు.

“చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలా ? ఊళ్లేలాలా ” అని హేళన చేసి ఆడపిల్లల మనసు నొప్పించేవారు. అప్పటికీ ఇప్పటికీ చదువులు విషయంలో తల్లితండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చినా , స్త్రీ , పురుషుల విషయంలో మాత్రం ఇంకా వివక్ష కోన సాగుతూనే వుంది . శేఖర్ కమ్ముల ఈ రెండు సామాజిక రుగ్మతలనే తన సినిమాకు కథగా ఎంచుకున్నాడు. అదే “లవ్ స్టోరీ “. ఈ రెండు అంశాలు సమాజంలో మనుషుల మధ్య అఘాతాలను సృష్టిస్తున్నాయి. మన ఇంత అభివృద్ధి సాధించిన తరువాత కూడా వీటి నుంచి బయటకు రాలేకపోతున్నాము. ఇవి సమాజంలో అసమానతలు కారణమవుతున్నాయని అందరికీ తెలుసు.

వీటి గురించి ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలనే అందుకు ఓ పెద్ద హీరో కావాలి . అప్పుడే మన చెప్పాలనుకున్న అంశాలు ప్రజల మనస్సులో బలంగా నాటుకుంటాయి అనే నమ్మకంతో లవ్ స్టోరీ సినిమాలో రేవంత్ , మౌనిక పాత్రలకు శేఖర్ కమ్ముల నాగ చైతన్య , సాయి పల్లవిని ఎంచుకున్నారు. శేఖర్ కమ్ముల మనసులో వున్న లవ్ స్టోరీ ఇదే.. దీన్ని సామాజిక ప్రయోజనం కోసం రూపొందించానని చెబుతున్న శేఖర్ కమ్ముల ప్రయత్నం సఫలం అవుతుందా ? లేదా ? అనేది ప్రేక్షకులు రేపే నిర్ణయించబోతున్నారు ?

Related posts