telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకు బాగా శ్రమిస్తున్న : రోహిత్

Rohit

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో మరో 200 మ్యాచులు సులువుగా ఆడేస్తానని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ తెలిపాడు. ఇప్పటికే 200 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్.. ఇదో గొప్ప మైలురాయని చెప్పాడు. లీగ్‌లో విజయవంతమైన జట్టుగా తాము కొన్ని ప్రమాణాలు నెలకొల్పామన్నాడు. ఫిట్‌గా ఉండేందుకు ఎంతో శ్రమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన హిట్ మ్యాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘పిక్క, తొడ కండరాల గాయాలు కాకుండా చాలా శ్రమిస్తున్నా. మూడు, నాలుగు నెలలుగా నా శరీరం దిగువ భాగాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఎందుకంటే గతేడాది ఐపీఎల్‌లో నేను గాయపడ్డాను. ఫిట్‌నెస్‌ కొనసాగించేందుకు చాలా చేయాల్సి వస్తోంది’ అని రోహిత్‌ అన్నాడు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఓటమి తర్వాత సమష్టిగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించామని తెలిపాడు. గెలుపోటములను తాము పట్టించుకోమని వెల్లడించాడు. చక్కగా సన్నద్ధమవ్వడమే తమకు అత్యంత కీలకమని స్పష్టం చేశాడు. ‘తొలి మ్యాచ్‌లో ఆడిన కొందరు పేసర్లు సైతం కసరత్తుల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ముంబై గర్వపడేది ఈ విషయంలోనే. మన అదనపు కృషే ఫలితాలను అనుకూలంగా మారుస్తుంది అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

Related posts