చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కరోన చాపాకింద నీరులా విస్తరిస్తోంది. ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణంలో అధికారులు ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం నుంచి పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయటకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉదయం మూడు గంటల వెసులుబాటును పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేశారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోనే అత్యంత కఠిన నిబంధనలను శ్రీకాళహస్తిలో అమలు చేయాలని నిర్ణయించామని, ఎవరైనా తమ ఆదేశాలు అతిక్రమిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.