telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా వారికీ కేసీఆర్ శుభాకాంక్షలు

Kcr telangana cm

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని సిఎం అభిలషించారు. రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని సిఎం తెలిపారు.

ఆర్ధికంగా వెనకబడిన ముస్లిం ల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న విషయాన్ని ఈ శుభ సందర్భంగా సిఎం గుర్తు చేసుకున్నారు. షాదీముబారక్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాలల్లో గుణాత్మకమార్పుకు దోహదపడుతుండడం గొప్ప విషయమన్నారు. ముస్లిం మైనారిటీ బిడ్డల చదువుల కోసం అమలు పరుస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయని సిఎం తెలిపారు. ప్రత్యేక గురుకులాలు సత్ఫలితాలను అందిస్తుండడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారి జీవితాల్లో గుణాత్మక అభివృద్దికి బాటలు వేస్తుండడం పట్ల సిఎం కెసిఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ముస్లిం సోదరులను సిఎం కెసిఆర్ కోరారు.

Related posts