telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”పై ట్రంప్ అభిప్రాయం ఇదే… మరో రెండు బయోపిక్ లకు వర్మ రంగం సిద్ధం

Laxmis NTR movie compliant CEC

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఒకవైపు తెలుగుదేశం నేతలు ఈ చిత్రం విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు అడ్డుపోవాలని ప్రయత్నిస్తుండగా… మరోవైపు వర్మ సరికొత్తగా తనదైన స్టయిల్లో సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ “లక్ష్మీస్ ఎన్టీఆర్”పై స్పందించారంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు వర్మ. ఈ వీడియోలో “ఆర్జీవీ తీసిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి?” అని రిపోర్టర్ ప్రశ్నించగా… ఇది చర్చించాల్సిన అంశమని, ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారని, సినిమాపై తన అభిప్రాయం తనకుందని ట్రంప్ చెబుతున్నారు. గతంలో ఓ సందర్భంగాలో ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను ఎడిట్ చేశారని వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమా ఆపడానికి మీకెంత కావాలి అని లైవ్లో అడగడం హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీతో ఓ వ్యక్తి కాల్ చేసి తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముందుగా టీడీపీకి ఓటేయాలనుకుంటున్న వాళ్లకు ఈ సినిమా ద్వారా మీరేం మెసేజ్ ఇవ్వదలచుకున్నారు ? అని అడగగా… వాళ్ళు ఏం చేయాలి ? ఏం ఫీల్ అవ్వాలన్నది వాళ్ళే ఆలోచించుకుని చేయాలి. అంతేగాని అది నేను చెప్పడం ధర్మం కాదు అంటూ ఆర్జీవీ సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ ఎంత ? అని సదరు వ్యక్తి అడగగా… వర్మ చెప్పనని చెప్పేశారు. దీంతో ఆ వ్యక్తి ఎందుకు అడుగుతున్నానంటే… మీ సినిమాను వ్యతిరేకించే టీం సినిమా బడ్జెట్, దానికి వచ్చే ప్రాఫిట్ కంటే డబుల్ ప్రాఫిట్ ఆఫర్ వస్తే మీరు ఈ సినిమాను ఆపేస్తారా ? అని అడిగారు. దానికి వర్మ “ఆపను” అంటూ సమాధానమిచ్చారు.

ఈ సినిమా తరువాత వర్మ మరో రెండు బయోపిక్ లను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకటి కెసిఆర్ బయోపిక్ కాగా, మరోటి వైఎస్సార్ బయోపిక్. కెసిఆర్ బయోపిక్ ఇంకా మొదలుకాలేదని, వైఎస్సార్ బయోపిక్ కు సంబంధించిన వర్క్ ఇప్పటికే మొదలైపోయిందని, ఈ బయోపిక్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత మొదలుపెట్టి ఆ తరువాత జరిగిన పరిణామాల మీద ఉంటుందని, ఈ బయోపిక్ కు “రెడ్డిగారు పోయారు” అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేసుకున్నట్లు ప్రకటించారు.

Related posts