మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. “భవిష్యత్తు గురించి దూరాలోచన చేసిన నేత”గా రాహుల్ ఆయనను అభివర్ణించారు. అటువంటి వ్యక్తిని మిస్ అవుతున్నామని అన్నారు.
“రాజీవ్ గాంధీ భావితరాల గురించి ఆలోచించిన వ్యక్తి. ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. అన్నింటికన్నా మించి, సాటివారిపై ఎంతో ప్రేమను, అభిమానాన్ని కనబరిచే వ్యక్తి. ఆయన్ను తండ్రిగా పొందగలగడం నేను చేసుకున్న అదృష్టమని రాహుల్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజీవ్ ను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. 1944 ఆగష్టు 20న ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. 1984 అక్టోబరులో దేశ ప్రధానిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అతి చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రికార్డు కూడా ఆయనదే. 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా రాజీవ్ గాంధీ పని చేశారు. మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎల్‌టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందారు. రాజీవ్ జన్మదినోత్సవాన్ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.


రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి