telugu navyamedia
సినిమా వార్తలు

కోదాడ ఎమ్మెల్యేను కలిసిన ఆర్‌. నారాయణమూర్తి

ప్రముఖ దర్శకుడు, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని స్వయంగా కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల కథాంశంగా చేసుకొని.. ఆయన ‘రైతన్న’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. ప్రజాప్రతినిధులను ఈ సినిమా చూడవలసిందిగా ఆయన కోరుతున్నారు. ఇటీవలే మంత్రి జగదీష్ రెడ్డి ని కలిసి.. సినిమా చూసినందుకు ధన్యవాదాలు తెలిపారు నారాయణ మూర్తి. తాజాగా.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని ఆయన నివాసంలో కలిశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలతో రైతులు పడుతున్న ఇబ్బందులు కథాంశంగా చేసుకొని తాను సినిమా తీశానని.. తప్పకుండా చూడాల్సిందిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని ఆయన కోరారు.

ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని చెప్పే చిత్రం ‘రైతన్న’. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. ఇవాళ రైతు పరిస్థితి ఏమిటి? రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అనే నానుడి ఏమైంది? అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు? డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. అదే ‘రైతన్న’ సినిమా సారాంశం” అని నారాయణ మూర్తి అన్నారు.

Related posts