అవని అంతటా నిశీధి మయం
కాస్త కూడా కానరాని సోముడు…!!!
కళ్లు బైర్లు చిమ్మచీకట్లో
తన కళ్లనే దివిటీలా చేసి
తన దేహాన్నే పరుపుగా మార్చి
పరాయి వాడికి పక్కపంచుతుంది…!!!
అందరూ వెలుతురులో పనిచేస్తే
ఆమె మాత్రం చీకటి లోనే
తనపని కానిచ్చేస్తుంది
రేపటి ఆశలకు ఊపిరి పోయడానికి…!!!
చీకటంటే భయం అందరికీ
కానీ ఆమెకి మాత్రం
చీకటంటే మహాఇష్టం…!!!
తన కళ్లల్లోని భావాలు చదవక్కర్లేదు
తన మనసులోతులు చూడక్కర్లేదు
తన గుండె చప్పుడు మాత్రమే తెలుస్తుంది
నేనింకా బ్రతికే ఉన్నానంటూ…!!!
చీకటికి వేయి కళ్లు వేసి చూసినా
ఆమె ముఖంలోని భావాల కడలిని
చదవలేరు ఎవ్వరూ
నిర్వేదమా నిస్సత్తువా నిర్లజ్జా
ఏమో తెలీని భావన
తనకి మాత్రమే అర్థమౌతుంది…!!!
కన్నబిడ్డ ఆకలి తీర్చడానికి
ఎంతో ప్రయత్నించిన ఆమెకి
వేరే ఏ మార్గం లేక
బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే చూడలేక
తాను చీకటిలో కలిసిపోతూ
తన బిడ్డ ఆకలిని తీర్చింది…!!!